Loading...

సనాతన ధర్మ పరిరక్షణకు వారాహి డిక్లరేషన్ ; పవన్ కళ్యాణ్

* ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలి  
* సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి యేటా నిధులు అందించాలి 
* సనాతన ధర్మం వైరస్ అంటున్నా హిందువులకు బాధ కలగకూడదా. 
* హిందువులకు బాధ కలిగితే తలుపులు వేసుకొని ఏడవాలా..?
* సూడో సెక్యూలరిస్టులు సనాతన ధర్మం, హైందవ సంప్రదాయాలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు  
* జగన్ నియమించిన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో తప్పు జరిగింది... అందుకు ఆయన బాధ్యత వహించాలి
* భారత న్యాయవ్యవస్థపై మాకు అపార గౌరవం... జగన్ గత నేర చరిత్రను కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి
* టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు 
* తిరుపతి వారాహి సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

వారాహి డిక్లరేషన్ ; 

 సనాతన ధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించే వ్యక్తిగా, 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష అనంతరం స్వామి వారి ఆశీర్వాదాలతో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాను. సనాతన ధర్మం మీద దాడి జరిగితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత సమాజం పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతుకై వినిపించాలి.                     

ఏ మతం, ఏ ధర్మానికీ భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం విశ్వాసాలకు భంగం వాటిల్లే చర్యలు అరికట్టడానికి బలమైన చట్టం అవసరం ఉంది. దానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. ఆలయాల్లో నిత్యం సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల నాణ్యత, స్వచ్ఛతను ధ్రువీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా... విద్య, కళా, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి.   కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా, ఆధ్యాత్మిక నగరి తిరుపతి వేదికగా దేశమంతటా వినిపించేలా ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన అనంతరం తిరుపతి బాలాజీ కూడలిలో గురువారం సాయంత్రం నిర్వహించిన వారాహి సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇంగ్లీషు, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రసంగిస్తూ సనాతన ధర్మానికి కలుగుతున్న విఘాతాన్ని, తన మనసులోని ఆవేదన వెలిబుచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుకు సాగే విధాన్ని ప్రజల ముందు ఉంచారు.   ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “నా మతాన్ని ఆరాధిస్తాను... అన్యమతాలను గౌరవిస్తాను. ఏనాడు కూడా ఇతర మతాలు, ధర్మాలను కించపరిచేలా మాట్లాడలేదు. మతం చూసి సాయం చేయలేదు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాము అంటే అందులో ముస్లింలు ఉన్నారు. క్రిస్టియన్లు ఉన్నారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను... నేను కోరుకునేది ఒక్కటే - నేను పాటించే ధర్మాన్ని దూషించకండి చాలు.    

 హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది ; 

   ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలం. ధైర్యం ఉన్న చోటే ఐశ్వర్యం ఉంటుంది. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. ఇదంతా మెకాలే తీసుకువచ్చిన వివక్ష. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారితో జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని మతాలను కలుపుకొని వెళ్లడం అంతే తప్ప- హిందూ ధర్మాన్ని ఒంటరిని చేసి చంపడం కాదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తే అనే వారికి ఒకటే చెబుతున్నాం... అలాంటి వాళ్లు వచ్చారు... పోయారు. సనాతన ధర్మం మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు శాశ్వతంగా ఉంది. సనాతన ధర్మాన్ని ముట్టుకున్నవాడు మాడి మసైపోతాడు జాగ్రత్త. 

ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు ; 

నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను. బలంగా హైందవ సనాతన ధర్మాన్ని విశ్వసిస్తాను. అదే సమయంలో ఇతర మతాల ఆచారాలకు, సంస్కృతిసంప్రదాయాలను నిండు మనసుతో గౌరవిస్తాను. గత దశాబ్దకాలం పైగా నన్ను వ్యక్తిగతంగా దూషించారు. అవమానించారు. అవహేళనలు చేశారు. నాకవేమీ బాధగా అనిపించలేదు. కానీ ఈ రోజు నేను పాటించే హైందవ సనాతన ధర్మానికి విఘాతం కలిగితే మాత్రం చూస్తూ ఊరుకోలేను. కూటమి ప్రభుత్వ పాలన మొదలై 100 రోజులైనా ఏనాడూ ప్రజా సభల్లో పాల్గొనలేదు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యలు తీర్చాలని, నిరుద్యోగం పారద్రోలాలని, సంక్షేమం, అభివృద్ధి నిండుగా జరగాలని భావించాను. అయితే అనుకోని విధంగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు నన్ను బాధించాయి. 

 ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే అవమానిస్తున్నారు ; 

భిన్నత్వంలో ఏకత్వం అనేది సనాతన ధర్మం పాటిస్తుంది. నా సభల్లో సైతం మధ్యలో నమాజ్ వినిపిస్తే సభను నిలుపుదల చేసి గౌరవించే వ్యక్తిని. వసుధైక కుటుంబంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని సనాతన ధర్మం కోరుకుంటుంది. సనాతన ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. నా దేవుడికి అందించే ప్రసాదంలో అపచారం జరిగిందని, దాని కోసం నేను స్వామి వారికి ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెడితే రకరకాలుగా మాట్లాడారు. రాజకీయం చేస్తున్నానని, అవహేళనగా మాట్లాడుతున్నారు. వారందరికీ నేను చెప్పేదొక్కటే. నా ధర్మాన్ని నేను పాటించడం తప్పెలా అవుతుంది..? నా సనాతన ధర్మంలో దీక్ష కూడా భాగమే. నేను ఇతర మతాల ఆచారాలను, వ్యవహారాల మీద ఎప్పుడూ మాట్లాడలేదు. నా ధర్మం పాటించి, దాన్ని కాపాడుకోవడానికి తపిస్తున్నాను.