Loading...

దమ్ముంటే జగన్ స్పందించాలని సవాలు తెదేపా ప్రతినిధి పట్టాభిరామ్

ఏఆర్ డెయిరీని అడ్డుపెట్టుకొని.. వైకాపా నేతలే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో కల్తీ చేసి క్షమించరాని పాపానికి ఒడిగట్టారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తితిదేకు వచ్చిన నెయ్యి ఏఆర్ డెయిరీ సొంత ప్లాంటులో తయారు కాలేదని స్పష్టం చేశారు. ఏఆర్ డెయిరీ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి, వైకాపా నేతలే ఎక్కడెక్కడి నుంచో కల్తీ నెయ్యి సేకరించి తిరుమల పంపారని మండిపడ్డారు. నెలకు 16 టన్నుల నెయ్యిని మాత్రమే ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్న ఏఆర్ డెయిరీకి ఆరు నెలల్లో వెయ్యి టన్నులు సరఫరా కాంట్రాక్టు  ఆరు నెలల్లో వెయ్యి టన్నులు సరఫరా కాంట్రాక్టు ఎలా ఇస్తారని నిలదీశారు. ఇది కుట్ర కాక మరేంటని విరుచుకుపడ్డారు. సదరు డెయిరీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. తితిదే టెక్నికల్ బృందం గతేడాది నవంబర్ 8న ఇచ్చిన నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తితో రూ.కోట్లు మింగడానికి తితిదే మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, కొందరు అధికారులు ఈ పాపానికి ఒడిగట్టారని విమర్శించారు. దమ్ముంటే దీనిపై జగన్ స్పందించాలని సవాలు విసిరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తితిదే సాంకేతిక బృందం ఇచ్చిన నివేదిక, తితిదే ల్యాబ్ నివేదికలు సహా పలు కీలక డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు.