Loading...

శ్రీవారి లడ్డూ లో కల్తీ దర్యాప్తు కోసం సిట్ ; సుప్రీంకోర్టు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు నమోదైన ఎఫ్ఎస్ఐఆర్పై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు, భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది. సీబీఐ అధికారుల పేర్లను ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి పేరును ఆ సంస్థ చైర్పర్సన్ ప్రతిపాదించాలని నిర్దేశించింది. ఈ బృంద దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందని గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానిపై తదుపరి విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

సిట్లో ఎవర్ని నియమించుకున్నా అభ్యంతరం లేదు ; 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గా వాదిస్తూ 'మేం సిట్ కొనసాగాలని కోరుకుంటున్నాం. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం సూచించిన అధికారులనెవరినైనా అందులో సభ్యులుగా నియమించడానికి మాకు అభ్యంతరం లేదు. ఒక ప్రభుత్వంగా మేం భక్తుల మనోభావాల దృష్ట్యా ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి, సిట్ ఏర్పాటు చేశాం. ఆ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప పత్రికల్లో వచ్చిన ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవద్దు' అని కోరారు. తితిదే మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ లడ్డూ కల్తీ విషయంలో ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో కాకుండా స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రకటన   చేయకపోయి ఉంటే వేరే విషయమని, ఇక్కడ    ప్రకటన చేసినందున స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని   కోరారు.