Loading...
image

ఈనాడు సంస్థల మరియు రామోజీ ఫిలింసిటీ అధినేత రామోజీ రావు కన్నుమూత

రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలెటర్పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

రామోజీగ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
"రామోజీరావు మరణ వార్త చాలా దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చిన వారే. ఎంతో మంది జర్నలిస్టులను అందించిన మహానుభావులు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో చేశారు. అత్యున్నత ప్రమాణాలతో గొప్ప ఫిల్మ్ సిటీని నిర్మించారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నా" అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం  ..  దివి కేగింది  అని రామోజీ రావు గారిని ఉద్దేశిస్తూ చిరంజీవి అన్నారు.

ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు....దేశానికి కూడా తీరని లోటు.  రామోజీరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను   -- చంద్రబాబు నాయుడు