Loading...

చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన

జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా అందరం ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారాలి. పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ సైనికులు. వారి వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నాం. వైకాపాది చెత్త ప్రభుత్వం. చెత్తమీద పన్ను వేశారు కానీ వ్యర్థాలను తొలగించలేదు. కావాలని ఆ చెత్తను షాపుల ముందు వేశారు. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని ఏడాదిలో తొలగించాలని పురపాలకశాఖ మంత్రి నారాయణను ఆదేశించా. ఏపీలో చెత్త పన్ను ఈరోజు నుంచి వసూలుచేయొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. వచ్చే కేబినెట్ లో పెట్టి ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు ఇస్తాం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా బుధవారం పర్యటించారు. ఈ   సందర్భంగా ఆయన ఆంధ్ర జాతీయ కళాశాలలో   గాంధీ విగ్రహానికి పూలదండ వేసి కళాశాల బయట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛసేవలో పాల్గొన్నారు. అనంతరం తితిదే కల్యాణమండపం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆదర్శం ; 

'పదేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్కు శ్రీకారం చుట్టారు. ఆ స్ఫూర్తితో 2019 వరకూ రాష్ట్రంలో పార్కులు, రోడ్లు అభివృద్ధి చేశాం. కానీ వైకాపా ప్రభుత్వం రాకతో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. 2019లో చెత్త నుంచి సంపద సృష్టికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో 2,43,612 మరుగుదొడ్లు, 8,124 టాయిలెట్లు, 110   మున్సిపాలిటీలను తెదేపా ప్రభుత్వం ఓడీఎఫ్ మార్చింది. తర్వాత వైకాపా ప్రభుత్వం ఓడీఎఫ్ ప్లస్ ను పక్కన పెట్టేసింది. కృష్ణాజిల్లా చల్లపల్లిలో పదేళ్ల నుంచి డాక్టర్ ప్రసాద్ దంపతులు   నిర్వహిస్తున్న 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' కార్యక్రమం అందరికీ స్ఫూర్తి కావాలి.  


 ఇంటింటికీ కుళాయి ; 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రతియేటా ఇస్తాం. 2025 మార్చి నాటికి మరుగుదొడ్లు లేని ఇళ్లకు వాటిని నిర్మిస్తాం. 2027 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత తాగునీరు ఇస్తాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్, నేను కూర్చొని జల్జీవన్ మిషన్కు డీపీఆర్ సిద్ధం చేస్తున్నాం. రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం. అమరావతి రాజధాని కూడా నిర్మిస్తాం. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉండాలి, అందులో తెలుగువారు 33% ఉండాలి.  2025 డిసెంబరు నాటికి బందరు పోర్టు పూర్తి   బందరు పోర్టును 2025 డిసెంబరు నాటికి పూర్తిచేస్తాం. ఎప్పుడో పూర్తికావాల్సిన పోర్టును దుర్మార్గులు నాశనం చేశారు. బందరు నుంచి రేపల్లెకు రైల్వేలైను ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం' అని చంద్రబాబు   చెప్పారు.