Loading...

బెల్జియం లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి పండుగ, భారతీయ సాంప్రదాయాలకి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ముఖ్య పర్వదినం. ఈ పండుగ సౌభాగ్యానికి, కృషి ఫలితానికి, కుటుంబ సమిష్టికి చిహ్నం. ఈ పండుగ ఉత్సాహాన్ని ప్రపంచమంతటా విస్తరించిన ప్రవాస భారతీయులు కూడా ఆచరిస్తూ, వారి మాతృభూమి పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో బెల్జియం దేశంలోని కంపెన్ హౌట్ నగరం, సంక్రాంతి సంబరాలకు అద్భుత వేదికగా మారింది.

ప్రవాస భారతీయుల సంప్రదాయ ఉత్సవం:  కంపెన్ హౌట్ నగరంలో నివసించే ప్రవాస భారతీయ తెలుగు వారు అందరూ కలసి తమ ఊరిలో జరుపుకున్నట్లుగా సంప్రదాయాలను పాటిస్తూ ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు, పెద్దలు కలిసి ఈ సంక్రాంతి వేడుకగా జరుపుకున్నారు.

పురుషులు పంచెకట్టులో, మహిళలు చీరలలో అందరిని ఆకట్టుకున్నారు.చిన్నారులు లుంగీలు, పట్టు లంగాలు ధరించి ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా చేశారు.

ఆటపాటల సందడి: పండుగ ఉత్సవాలలో భాగంగా పిల్లలు పెద్దలు కలసి సాంప్రదాయ నృత్యాలు చేసిన ఉత్సాహభరితమైన దృశ్యాలు ఆకట్టుకున్నాయి. పల్లె జానపద గీతాలు ఊరంతా మారుమ్రోగాయి. పండుగ ప్రత్యేకమైన  లడ్డూలు, అరిసెలు, పాయసం వంటి చక్కటి రుచికరమైన పిండివంటలు అతిధులకు పంచి పెట్టారు. 

ఈ పండుగ సంబరాలను దీప బోరెంగే మరియు అనిత కనుమూరి ఆధ్వర్యంలో అద్భుతంగా ఏర్పాటు చేశారు, వారు చూపిన ఆత్మీయతకు ప్రతి ఒక్కరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

సాయంత్రం సమయంలో, విందు భోజనం ఏర్పాటుతో వేడుకను మరింత ఘనతతో ముగించారు. ప్రవాస భారతీయుల సంక్రాంతి సంబరాలు అక్కడి ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిచ్చాయి. ఈ ఉత్సవాలు సమిష్టి సమైక్యత, సాంప్రదాయాల పునరుద్ధరణ, ఆనందభరిత సమయానికి చిహ్నంగా నిలిచాయి.

ఇలాంటి పండుగల ద్వారా, ప్రదేశం మారినా, వారి సాంప్రదాయాల పట్ల ఉన్న అభిమానాన్ని, కుటుంబ సమిష్టి విలువలను, భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను బావి తరాలకు అందిస్తున్నారు. 

కంపెన్ హౌట్ నగరం, ఈ సంక్రాంతి పండుగకు వేదిక కావడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మీయతను తెలియజేసింది. 

"తెలుగు వారు ఏ దేశానికి వెళ్ళినా వారి సంప్రదాయాలు విడిచిపెట్టరు" అని ఈ వేడుకలు మరోసారి రుజువు చేశాయి.