నన్ను వదిలెయ్యండి ఇక రాజకీయాల గురించి మాట్లాడను పోసాని
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దెబ్బకు ప్రతిపక్ష వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవర్ని అరెస్ట్ చేస్తారా? అని భయపడుతున్నారు. గతంలో చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబంపై పలువురు ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషిస్తూ అభ్యంతరకర పోస్టులు పెట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఎప్పుడు తమను అరెస్ట్ చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోసాని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పొగడను.. విమర్శించను
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెప్పేశారు. ఇక మీదట జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను అన్నారు. లైఫ్‌లో పాలిటిక్స్ జోలికి వెళ్లనని చెప్పారు. ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని తెలిపారు. ఏ పార్టీనో తిట్టడానికి రాజకీయాల్లోకి రాలేదని పోసాని స్పష్టం చేశారు. ఇకపై ఏ పార్టీని కూడా పొగడను అని.. అలాగే విమర్శించను అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో ఇక నుంచి తనకు సంబంధం లేదన్నారు పోసాని.
అదే కారణమా?
పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తంగా 10 కేసులు నమోదయ్యాయి. ఆయన పాలిటిక్స్ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమని సమాచారం. కాగా, సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఒంగోలులో ఆర్జీవీపై కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.