విద్యుత్ అదనపు చార్జిల భారాన్ని తక్షణమే రద్దు చేయాలి.
అంబేద్కర్ సర్కిల్లో జరిగే ఆందోళనలో సిపిఎం నేత రామమోహన్ డిమాండ్. రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ అదనపు చార్జీల భారాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కడపలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ అదనపు భారాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, ఆదాని ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల తిరగకముందే 15,484 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేయడం దారుణమన్నారు. 2022 -23 సంవత్సరాల్లో వినియోగించుకున్న విద్యుత్ పై 6072 కోట్ల రూపాయల సర్దుబాటు చార్జీల పేరుతో నేడు జనం నుండి వసూలు చేయటం శోచనీయమన్నారు. వచ్చే నెల నుండి 2023 -24 సర్దుబాటు చార్జీ 9412 కోట్ల రూపాయల భారం పడనున్నదన్నారు. ఇప్పటికే 2014-19 ట్రూ అప్ చార్జీలు మరియు గత నెల బిల్లులపై 40 పైసలు సర్దుబాటు చార్జీ వసూళ్లు చేస్తున్నారన్నారు. తాజాగా మూడవ సర్దుబాటు చార్జీ బిల్లులో వేశారు, వచ్చేనెల 4వ సర్దుబాటు చార్జీ కలపటానికి రంగం సిద్ధం అయ్యిందన్నారు. ఈ నెల బిల్లులలో 10 శాతం నుండి 30 శాతం వరకు బిల్లులు పెరిగాయన్నారు. నిరుపేదలపై మరింత భారం పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు 30 శాతం ఉండగా సర్దుబాటు చార్జీలు, అదనపు చార్జీలు 70 శాతం ఉండటం దారుణమన్నారు. చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని మాట ఇచ్చిన కూటమి, నేడు మాట తప్పి గత ప్రభుత్వం చేసిన తప్పులను సరి చేయాల్సిన బాధ్యత కూటమిపై ఉండగా ,భారం మోపి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కమిటీ సభ్యులు జమీలా, కామనూరు శ్రీనివాస్ రెడ్డి దస్తగిరి రెడ్డి, కుమారస్వామి రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు, కామేశ్వరమ్మ, రామకృష్ణారెడ్డి, రాజామణి, షంశాద్, లతీఫా, మాధవ రెడ్డి , శివకుమార్, తిమ్మయ్య, అభినయ్, నరసింహ, విజయ్ , పాలయ్య, తదితరులు పాల్గొన్నారు.