Loading...

డల్లాస్ లో సంక్రాంతి సందడి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా సంక్రాంతి సంబరాలు

డల్లాస్: (ఆదివారం 26, 2025): భారతీయ  సంస్కృతి, సాంప్రదాయాలకి ప్రతీకగా నిలిచే సంక్రాంతి  పండుగను ప్రపంచమంతటా విస్తరించిన ప్రవాస భారతీయులు కూడా ఆచరిస్తూ, వారి మాతృభూమి పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో డల్లాస్ లోని ఫ్రిస్కో, సంక్రాంతి సంబరాలకు అద్భుత వేదికగా మారింది.

ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) స్థాపించిన మొదటి సంవత్సరం లోనే డల్లాస్ మహానగరం లో ఆ సంస్ద అధ్యక్షులైన రాజ్ కిరణ్ చెన్నారెడ్డి , హిమబిందు  చెకూరి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు చాల ఘనంగా జరిగాయి. 

 ఈ వేడుకకు ముఖ్యంగా బాలాజీ వీర్నాల AAA నేషనల్ ప్రెసిడెంట్ మరియు ఆ సంస్ద డల్లాస్ ఇంచార్జి సత్య వెజ్జు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. AAA అనేది మన ఆంధ్రుల హృదయాల్లో నిలుస్తూ, మన మూలాలను గుర్తు చేసుకుంటూ, మన సంస్కృతిని భావి తరాలవారికి అందిస్తుంది అని కొనియాడారు. ఇది ఆంధ్ర సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ, తెలుగు వారందరిని ఒకేచోట చేర్చి మన సంస్కృతిని పండుగలా జరుపుకునేల  అవకాశాన్ని కల్పిస్తోంది.

AAA ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా ముగ్గుల పోటీలు, లఘు చిత్రాలు  మరియు రీల్స్  పోటీలు నిర్వహిస్తున్నాము అని , మన ఆంధ్ర సంస్కృతిని ప్రోత్సహిస్తూ పోటీలో పాల్గొన్న వారికి కోటిన్నర రూపాయలకు పైగ విలువ చేసే బహుమతులు అందిస్తున్నాము అన్నారు. Click on this Link for registration

సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తూ రంగవల్లులు,  పల్లె వాతావరణ అలంకరణలతో అందంగా ఫోటో షూట్ ఏర్పాటు చేశారు. బొమ్మలకొలువు,పిల్లలకు భోగిపళ్ళు ఏర్పాటు చేశారు. ఫ్యాన్సీ, ఆభరణాలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ స్టాల్స్ ఏర్పాటు చేసి అతిథులకు విశేష అనుభూతిని కలిగించారు. 

హాజరైన వారందరికీ  నలభై అయిదు రకాల వెజ్/నాన్ వెజ్ వెరైటీ వంటలతో చక్కని ఆతిథ్యం ఇచ్చారు. 

పిల్లలు డాన్స్ పెర్ఫార్మెన్స్తోటి అదరగొట్టారు. యువత తమ దుమ్ముదులిపే స్టెప్‌లతో స్టేజిని హోరెత్తించి, ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. మహిళలు ఫ్యాషన్ షో మరియు వివిధ రకాల నృత్య ప్రదర్శనలతో హాజరైన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేశారు.

మణిశర్మ అండ్ టీం పర్ఫార్మ్ చేసిన మ్యూజిక్ కాన్సర్ట్ హాజరైన అతిధులు అందర్నీ ఉర్రూతలూగించింది.  

ఫిలడెల్ఫియాలో మార్చిలో జరగబోయే AAA నేషనల్ కన్వెన్షన్ కి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హాజరవుతున్నారని దానికి అందరం సంసిద్ధులుగా ఉండాలని రాజ్ కిరణ్ చెన్నారెడ్డి తెలిపారు. 

సమీరా మరియు పవిత్ర  గార్ల చక్కటి యాంకరింగ్‌తో ప్రేక్షకులు మంత్ర ముగ్ధులై, ఆద్యంతం ఈ ఈవెంట్‌ను ఆస్వాదించారు.

రాఫెల్ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతిగా గోల్డ్ మరియు సిల్వర్ కాయిన్లు అందజేశారు.

డల్లాస్ లో ఉన్న వివిధ తెలుగు సంఘాలను ప్రత్యేకంగా స్టేజ్ పైకి ఆహ్వానించి, వారు చేస్తున్న సేవలకు గాను వారిని ఘనంగా సత్కరించారు.  

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించే సంస్థను స్థాపించిన హరి మోతుపల్లి గారిని రాజ్ కిరణ్ చెన్నారెడ్డి అభినందించారు. ఈవెంట్ విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వాలంటీర్లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

5,000కి పైగా అతిథులతో కళకళలాడిన సభా ప్రాంగణం, తెలుగువారి సంక్రాంతి శోభను ఆవిష్కరించింది. అందమైన వస్త్రధారణలో పిల్లలు, పెద్దలు పాల్గొని ఆనందంగా గడిపారు.

 

---------> Siva Pallaprolu  <----------