ఆంధ్రప్రదేశ్ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం
చప్పట్లు, కేకలతో మార్మోగిన సభా ప్రాంగణం
వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం
‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కేసరపల్లి సభావేదికపై పవన్ తో ప్రమాణం చేయించారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు. ఆపై వేదికపై ఉన్న గవర్నర్, ఇతర ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కల్యాణ్ నమస్కరించారు. అన్న చిరంజీవికి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.