అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం దిశగా వెళుతుందంటున్న ప్రైవేటు వాతావరణ సంస్థలు ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇప్పుడు, వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ జారీ చేసింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది. ప్రస్తుతం ఐఎండీ సమాచారం మేరకు అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అది వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి, అక్టోబరు 24 నాటికి వాయుగుండంగా మారుతుందని ఏపీఎస్డీఎంఏ వివరించింది. అయితే, ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. కాగా, ప్రైవేటు వాతావరణ సంస్థల అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం ఏపీ ఉత్తర కోస్తా, ఒడిశా దక్షిణ తీరం దిశగా పయనిస్తుందని తెలుస్తోంది.